శనగ పిండి బిల్లలపులుసు/శనగ బిళ్ళల పులుసు
ప్రతి ఒక వంటకు ఒక ప్రత్యేకత ఉంటుంది, ఎందుకంటే దానిని చేయడానికి పెట్టిన శ్రద్ధ కొత్తదనం ఆ వంటలో కనిపిస్తుంది. అలాంటి ఒక వంట ఈ రోజు మీకు పరిచయం చేస్తాను . కానీ నాకు ఈ వంట గురించి తెలియదు కానీ తెలిసిన ఒక మేడమ్ చెప్పడంతో ఇంట్రెస్టింగ్ గా ఉందని మీకు కూడా పరిచయం చేద్దాం అనుకుంటున్నా.
ముందుగా ఈ కూర వెనుక ఒక కథ ఉంది అంటా , దాన్ని తెలుసుకుంటే ఈ కూర ఇంకొంత నచ్చుతుంది.
ఒకరోజు ఒక బ్రాహ్మణ స్త్రీ తన అవసరం కొరకు ఇంటి చాకలి ఆమె కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళింది అక్కడ వారు చేపల పులుసు వండుతున్నారు.ఆమెకు అది చూస్తే తినాలి అనిపించిందట ,అదే విషయాన్ని ఇంటికి వచ్చి తన అత్తగారికి చెప్పింది.ఆమె కడుపుతో ఉన్న కోడలు అడిగిన కోరిక ఎలా అయినా తీర్చాలి అనుకుంది కానీ బ్రాహ్మణులు చేపలు తినరు కదా అని ఆలోచించి ఈ వంటకం చేసిందట.నిజంగా ఒక్కో వంట ఒక కొత్త ఆవిష్కరణ.
వంటిల్లు ఒక వైద్యశాల , ప్రయోగశాల అని ఊరికే అనలేదు పెద్దలు.
సరే ఇక ఆ వంట ఏంటో తెలుసుకుందాం.
శనగపిండి బిళ్ళల పులుసు/శనగ బిళ్ళల పులుసు.
కావలసిన పదార్థాలు:
శనగపిండి 2 కప్పులు
చింతపండు.
ఉప్పు
కారం పొడి
ధనియాల పొడి
మెంతిపొడి
నూనె
ఉల్లిపాయలు
తయారీ విధానం.
రెండు కప్పుల శనగపిండిని మూకుడులో రెండు చెంచాల నెయ్యి వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి, ఈ పిండిలో కొద్దిగా అల్లంవెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, ధనియాలపొడి, చిటికెడు మెంతిపొడి అన్నింటినీ మంచిగా పిండిలో కలిసేలా కలిపి కొద్దిగా వేడినీళ్లతో చపాతి పిండి కంటే కూడా మృదువుగా కలిపుకోవాలి, ఈ ముద్దను ఒక ప్లేటు కు నూనె రాసుకుని కొద్దిగా మందంగా చేతితో ఒత్తుకోవాలి.
నాన పెట్టుకున్న చింతపండును రసం తీసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నూనె వేసుకొని అందులో తరిగన ఉల్లిపాయలు వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి దోరగా వేగిన తరువాత కొద్దిగా మెంతిపొడి కారం వేసుకొని కారం కూడా వేగిన తరువాత (కారం వాడకూడదు) చింతపండు రసం వేసుకోవాలి . ఇప్పుడు శనగపిండి అద్ది పెట్టుకున్న ప్లేటును గిన్నెపైన పెట్టుకోవాలి దాని పైన ఇంకో ప్లేటు ను పెట్టుకోవాలి. ఇలా ఆవిరి మీద పదినిమిషాలు ఉంచాలి. తరువాత పిండిని స్క్వేర్ కానీ, గుండ్రంగా కానీ, డైమండ్ లాగా కట్ చేసి మరుగుతున్న పులుసు లో వేసి కొద్దిగా చిక్కగా అయ్యేవరకు మరిగించాలి. అంతే శనగబిళ్ళల పులుసు రెడీ 😊
ఇది అన్నంలోకి కానీ చపాతీ లోకి గాని బాగుంటుంది.
Comments
Post a Comment