Low-Buy Living: అనవసరమైన ఖర్చులు తగ్గించి ప్రశాంతమైన జీవితం ఎలా పొందాలి?
Low-Buy Living: అనవసరమైన ఖర్చులు తగ్గించి ప్రశాంతమైన జీవితం ఎలా పొందాలి?
ఇప్పుడు కొంతమంది ఒక వస్తువు కొనే ముందు అది నిజంగా అవసరమా లేదా అని ఆలోచించడం కంటే, దానితో ఒక రీల్ ఎలా చేయాలి? సోషల్ మీడియాలో ఎలా పోస్ట్ చేయాలి? అని ఆలోచించే పరిస్థితి వచ్చింది.
కారు కొన్నారనుకోండి. దానిపై ఒక క్లాత్ కప్పి, సినిమాటిక్ స్టైల్‌లో ఆ క్లాత్‌ను తొలగిస్తూ వీడియో తీసి Instagram, Facebook వంటి సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తున్నారు. కొత్త కారు కొన్న ఆనందాన్ని అందరితో పంచుకోవడానికి గ్రాండ్‌గా పార్టీలు కూడా ఇస్తున్నారు.
డబ్బు ఉండి కొనేవారు కొందరైతే, మరికొందరు EMIలపై కొంత డౌన్ పేమెంట్ చెల్లించి వస్తువులు కొంటున్నారు. ఇంకొందరు పరిస్థితులు అనుకూలించక వాటిని తిరిగి అమ్మి అప్పులు తీర్చుకుంటున్నారు.
అందుకే మన పెద్దలు ఎప్పుడో చెప్పిన మాట ఇప్పటికీ గుర్తుంచుకోవాలి:
“దుప్పటి ఉన్నంతవరకే కాళ్లు చాపాలి.”
మన దగ్గర ఉన్న ఆర్థిక స్థితిని బట్టి ముందుకు వెళ్లాలి. ఇతరులను చూసి మన జీవితాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకు అవసరమైన ఒక మంచి జీవన విధానమే “Low-Buy Living.”
Low-Buy Living అంటే ఏమిటి?
Low-Buy Living అంటే అసలు ఏమీ కొనకుండా ఉండటం కాదు. ఇది అనవసరమైన కొనుగోళ్లను తగ్గించి, నిజంగా అవసరమైన వాటినే ఆలోచించి కొనుగోలు చేయడం.
నేటి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది. అందులో రకరకాల షాపింగ్ యాప్స్, ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ఫ్లాష్ సేల్స్, నోటిఫికేషన్లు మనల్ని నిరంతరం ఏదో ఒకటి కొనడానికి ప్రేరేపిస్తుంటాయి.
కానీ మనం అప్పుడప్పుడు మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి:
“నేను కొంటున్న ఈ వస్తువు నిజంగా నాకు అవసరమా? లేక ఆఫర్ ఉందని, కొత్తగా వచ్చిందని, ఇతరులు కొంటున్నారని కొంటున్నానా?”
కొన్న వస్తువులు మనకు నిజమైన సంతోషాన్ని ఇస్తున్నాయా? లేక ఇంట్లోనూ, మనసులోనూ గందరగోళాన్ని పెంచుతున్నాయా?
ఈ ఆలోచనతోనే Low-Buy జీవనశైలిని ప్రారంభించవచ్చు.
నా చిన్ననాటి ఒక ఉదాహరణ
నా చిన్నతనంలో చెప్పులు ఒకే జత ఉండేవి.
అవి తెగిపోతే వెంటనే కొత్తవి కొనేవాళ్లం కాదు. వీలైతే వాటిని కుట్టించుకుని మళ్లీ ఉపయోగించేవాళ్లం. పూర్తిగా పాడైపోయిన తర్వాతే కొత్త చెప్పులు కొనేవాళ్లం.
అప్పట్లో చాలా కుటుంబాల్లో ఇదే పద్ధతి ఉండేది.
కానీ ఇప్పుడు నా దగ్గరే ఐదు జతల చెప్పులు ఉన్నాయి. బయటకు వెళ్లడానికి ఒకటి, ఫంక్షన్లకు ఒకటి, హాస్పిటల్‌కు ఒకటి... ఇలా.
నిజానికి వీటన్నింటి అవసరం ఉందా?
ఒక్క జతతోనే చాలా పనులు చేసుకోవచ్చు. అయినా రకరకాలుగా కొనేస్తున్నాం.
ఇది చెప్పులకే పరిమితం కాదు.
దుస్తులు, వాచీలు, నగలు, బ్యాగులు, కిచెన్ వస్తువులు, ఇంటి అలంకరణ వస్తువులు... ఇలా ఎన్నో వస్తువులు అవసరం లేకపోయినా మన ఇంట్లోకి వస్తున్నాయి.
“అందుబాటులో ఉంది కదా” అనే ఆలోచనతో కొంటున్నాం.
Low-Buy ప్రారంభించడానికి 5 ముఖ్యమైన సూత్రాలు
1. అవసరం (Need) – కోరిక (Want) మధ్య తేడా తెలుసుకోండి
ఏదైనా వస్తువు నచ్చినప్పుడు వెంటనే కొనేయకుండా కాసేపు ఆగండి.
మిమ్మల్ని మీరు రెండు ప్రశ్నలు అడగండి:
- ఇది లేకపోతే నా రోజువారీ పని ఆగిపోతుందా?
- నా దగ్గర ఇప్పటికే ఇలాంటి వస్తువు ఉందా?
అది నిజంగా అవసరమైతే కొనండి.
కేవలం చూడటానికి బాగుందని, డిస్కౌంట్ ఉందని, కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిందని కొనాలనిపిస్తే అది కోరిక కావచ్చు.
ఈ చిన్న తేడాను అర్థం చేసుకోవడం Low-Buy జీవనశైలికి మొదటి అడుగు.
2. 30 రోజుల నియమం పాటించండి
ఏదైనా ఖరీదైన వస్తువు కొనాలనిపిస్తే వెంటనే కొనకండి.
ఆ వస్తువు పేరు మీ నోట్‌ప్యాడ్‌లో లేదా Wishlistలో రాసుకుని 30 రోజులు వేచి చూడండి.
30 రోజుల తర్వాత కూడా అది నిజంగా అవసరమే అనిపిస్తే కొనండి.
చాలాసార్లు మనకు మొదట ఉన్న ఉత్సాహం కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది.
మార్కెట్‌లోకి కొత్త వస్తువు వచ్చిందని తెలియగానే “First Buy” చేయాలనే ఆలోచన ఉన్నవారికి ఈ నియమం చాలా ఉపయోగపడుతుంది.
3. ‘Shop Your Own Home’
కొత్త వస్తువు కొనేముందు ముందుగా మీ ఇంట్లోనే వెతకండి.
ఎప్పుడో కొన్న వస్తువులు ఇంట్లో ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉండవచ్చు. వాటిని బయటకు తీసి చూసినప్పుడు మనకు అవసరమైన వస్తువు ఇప్పటికే మన దగ్గరే ఉందని అర్థం కావచ్చు.
పాత దుస్తులను కొత్త కాంబినేషన్లలో ఉపయోగించవచ్చు.
వాడకంలో లేని మంచి దుస్తులను అవసరమైన వారికి ఇవ్వవచ్చు.
ఇంటి ఫర్నిచర్ లేదా అలంకరణ వస్తువుల స్థానాలను మార్చడం ద్వారా కూడా ఇంటికి కొత్త లుక్ తీసుకురావచ్చు.
కొత్తది కొనడం ఒక్కటే మార్పు కాదు; ఉన్నదాన్ని కొత్తగా ఉపయోగించడం కూడా ఒక మంచి మార్గమే.
4. One In – One Out Rule
ఇంట్లోకి ఒక కొత్త వస్తువు వస్తే, దానికి బదులుగా ఒక పాత వస్తువును బయటకు పంపే అలవాటు చేసుకోండి.
ఉదాహరణకు కొత్త షర్ట్ కొంటే, చాలా కాలంగా ఉపయోగించని ఒక షర్ట్‌ను అవసరమైన వ్యక్తికి ఇవ్వండి.
కొత్త కప్పులు కొంటే, ఉపయోగించని పాత కప్పులను తొలగించండి.
దీనివల్ల ఇంట్లో వస్తువుల సంఖ్య అంతులేకుండా పెరగదు.
ఇల్లు మనం నివసించే ప్రదేశం కానీ, అనవసరమైన వస్తువులతో నింపే డంప్‌యార్డు కాదు.
5. డిజిటల్ ప్రేరణలను తగ్గించండి
మీ ఫోన్‌లోని షాపింగ్ యాప్స్ నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి.
Amazon, Flipkart వంటి షాపింగ్ యాప్స్ నుంచి వచ్చే అవసరం లేని ప్రమోషనల్ నోటిఫికేషన్లను తగ్గించండి. అవసరం లేని promotional emails ఉంటే unsubscribe చేయండి.
ఎందుకంటే:
“కంటికి కనిపించకపోతే, ఆలోచన కూడా తక్కువగా వస్తుంది.”
ఆఫర్ కనిపిస్తే మనం టెంప్ట్ అవుతాం. కానీ ఆన్‌లైన్‌లో ఏదో ఒక ఆఫర్ ఎప్పుడూ ఉంటుంది.
ప్రతి ఆఫర్ మనకు అవసరం కాదు.
రోజువారీ జీవితంలో Low-Buy ఎలా పాటించాలి?
దుస్తులు
తక్కువ దుస్తులతో ఎక్కువ కాంబినేషన్లు వేసుకునేలా Capsule Wardrobe విధానాన్ని ప్రయత్నించవచ్చు.
అవసరం లేని ప్రతి కొత్త డ్రెస్‌ను కొనడం కంటే, ఇప్పటికే ఉన్న దుస్తులను ఎక్కువగా ఉపయోగించండి.
కిరాణా మరియు గ్రాసరీ
షాపింగ్‌కు వెళ్లే ముందు ఖచ్చితమైన లిస్ట్ తయారు చేసుకోండి.
లిస్ట్‌లో లేని వస్తువులను కేవలం ఆఫర్ ఉందని కొనకండి.
ఆకలితో షాపింగ్‌కు వెళ్లకుండా ఉండటం కూడా మంచిదే. ఆకలిగా ఉన్నప్పుడు అవసరానికి మించి స్నాక్స్, తినుబండారాలు కొనడానికి అవకాశం ఉంటుంది.
Home Decor
ఇంటిని అందంగా మార్చడానికి ప్రతిసారీ కొత్త వస్తువులు కొనాల్సిన అవసరం లేదు.
ఇండోర్ మొక్కలు, DIY వస్తువులు, ఇంట్లో ఇప్పటికే ఉన్న అలంకరణ వస్తువులను కొత్తగా అమర్చడం ద్వారా ఇంటికి కొత్త రూపాన్ని ఇవ్వవచ్చు.
షాపింగ్ కార్ట్‌లో వస్తువు వేసే ముందు ఈ 3 ప్రశ్నలు అడగండి
- దీన్ని శుభ్రం చేయడానికి, సర్దడానికి నా దగ్గర సమయం ఉందా?
- ఇలాంటి వస్తువు ఇప్పటికే నా దగ్గర ఉందా?
- ఈ డబ్బును ఏదైనా అనుభవానికి, కుటుంబంతో ప్రయాణానికి లేదా పొదుపుకు ఉపయోగించవచ్చా?
ఈ మూడు ప్రశ్నలు మన కొనుగోళ్లను చాలా వరకు మార్చగలవు.
సంపాదనలో కొంత భాగాన్ని తప్పనిసరిగా పొదుపు చేయండి
మనం సంపాదించిన డబ్బులో వీలైనంతవరకు 20–30 శాతం పొదుపు చేయడానికి ప్రయత్నించవచ్చు.
ఈ రోజు మనం దాచిన చిన్న మొత్తం రేపటి అవసర సమయంలో ఎంతో ఉపయోగపడుతుంది.
నెలాఖరులో డబ్బు మిగిలితే పొదుపు చేయడం కంటే, ముందుగానే పొదుపు చేసి మిగిలిన డబ్బుతో ఖర్చులను నిర్వహించడం చాలా మందికి సులభమైన పద్ధతిగా ఉంటుంది.
ఒకసారి సోషల్ మీడియాలో చూసిన ఒక పోస్ట్‌లో బెంగళూరులో పనిచేస్తున్న ఒక వ్యక్తి మంచి జీతం వస్తున్నప్పటికీ నెలాఖరుకు డబ్బు మిగలడం లేదని చెప్పాడు.
ఇది ఒక్క వ్యక్తి సమస్య కాదు. ఎక్కువ సంపాదించడం మాత్రమే ముఖ్యం కాదు.
మన దగ్గర ఉన్న డబ్బుపై మనకు ఎంత నియంత్రణ ఉంది అన్నదీ అంతే ముఖ్యం.
డబ్బు ఉన్నప్పుడు మొత్తం ఖర్చు చేసి, తర్వాత అవసరం వచ్చినప్పుడు బాధపడటం కంటే ఉన్నప్పుడే కొంత పొదుపు చేసుకోవడం మంచిది.
Low-Buy Living వల్ల కలిగే ప్రయోజనాలు
ఆర్థిక భరోసా
అనవసరమైన కొనుగోళ్లు తగ్గితే నెలాఖరులో కొంత డబ్బు మిగలవచ్చు. అత్యవసర పరిస్థితులకు ఆ పొదుపు ఉపయోగపడుతుంది.
ఇంట్లో ప్రశాంతత
ఇంట్లో వస్తువులు తక్కువగా ఉంటే వాటిని సర్దడం, శుభ్రం చేయడం సులభం.
ఎన్ని వస్తువులు ఉంటే అన్ని సర్దాలి, శుభ్రం చేయాలి, నిర్వహించాలి.
ఈ బిజీ జీవితంలో మనకోసం మనమే సమయం కేటాయించుకోలేకపోతున్నాం. అలాంటప్పుడు అవసరం లేని వస్తువులను నిర్వహించడానికి మరింత సమయం ఎందుకు కేటాయించాలి?
పర్యావరణానికి మేలు
అనవసరమైన కొనుగోళ్లు తగ్గితే వ్యర్థాలు కూడా తగ్గుతాయి.
ఉదాహరణకు కిచెన్‌లో ప్లాస్టిక్ డబ్బాలు పాడవకుండా ఉన్నప్పటికీ కొత్త డిజైన్ వచ్చిందని మార్చాల్సిన అవసరం లేదు.
వీలైన చోట స్టీల్ లేదా గాజు వంటి ఎక్కువకాలం ఉపయోగించగల వస్తువులను ఎంచుకోవచ్చు. ఉన్న వస్తువులను జాగ్రత్తగా ఉపయోగించి, పూర్తిగా పాడైన తర్వాతే కొత్తవి కొనడం మంచిది.
మానసిక ప్రశాంతత
ఇతరులతో పోల్చుకోవడం తగ్గుతుంది.
ఎవరైనా కొత్త కారు కొన్నారు కాబట్టి మనం కూడా కొనాలి.
ఎవరైనా కొత్త ఫోన్ కొన్నారు కాబట్టి మన ఫోన్ మార్చాలి.
ఎవరైనా కొత్త దుస్తులు వేసుకున్నారు కాబట్టి మనం కూడా కొత్తవి కొనాలి.
అలా కాకుండా మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి:
“ఈ వస్తువు నాకు ఎంత అవసరం? ఇది చేసే పని నా దగ్గర ఉన్న మరో వస్తువుతో అవుతుందా?”
అనే ఆలోచనతో కొనుగోలు చేస్తే చాలా అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవచ్చు.
చివరగా...
Low-Buy జీవనశైలి అంటే ఆనందాలను వదులుకోవడం కాదు.
అది మనల్ని మనం కష్టమైన నియమాల్లో బంధించుకోవడం కూడా కాదు.
మనకు నిజంగా అవసరమైన, ఉపయోగపడే వస్తువులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం.
మన జీవితం సోషల్ మీడియాలో కనిపించే జీవితంతో పోటీ పడాల్సిన అవసరం లేదు.
కొత్తది కొనడం తప్పు కాదు. కానీ అవసరం లేకుండా కొనడం అలవాటుగా మారడం మాత్రం మనం ఆలోచించాల్సిన విషయం.
మన దగ్గర ఉన్నదాన్ని గౌరవించాలి. ఉపయోగించాలి. జాగ్రత్తగా చూసుకోవాలి.
తక్కువ వస్తువులు... తక్కువ ఖర్చులు... తక్కువ గందరగోళం...
ఇవన్నీ కలిపి మనకు ఎక్కువ ప్రశాంతతను ఇవ్వవచ్చు.
అందుకే ఈ రోజే ఇంట్లో ఒక చిన్న విభాగాన్ని ఎంచుకోండి.
మీ దుస్తుల అల్మారా కావచ్చు, కిచెన్ కావచ్చు, షూ ర్యాక్ కావచ్చు.
అక్కడ అవసరం లేని వస్తువులను గుర్తించండి.
అక్కడి నుంచే మీ Low-Buy ప్రయాణాన్ని ప్రారంభించండి.
Comments
Post a Comment